
“నాందీ శ్లోక మాల“
భాగవతం అనగానే భక్తిలో తడిసిన గాథలు అలలుగా పొంగివస్తాయి – గజేంద్రమోక్షం, ప్రహ్లాదచరిత్ర, వామన చరిత్ర, రుక్మిణీకల్యాణం, అంబరీషోపాఖ్యానం, అజామిళోపా ఖ్యానం – ఇంచుమించుగా భాగవతంలోని ఉపాఖ్యానాలన్నీ. ఈ భక్తమణుల చరిత్రలను ఏకత్రితం చేసిన మూలసూత్రం వాసుదేవతత్త్వం. వ్యాసునంతటివాడే వేదాలను వింగడించి, అష్టాదశ పురాణాలు విరచించి, బ్రహ్మసూత్రాలను ప్రవచించి, భారతాన్ని ప్రబంధీకరించి అప్పటికీ మనస్సు నిండక ‘హరికీ, యోగివరులకూ అభిలాషమైన భాగవత గాథ పలుకనైతినే’ అని ఖిన్నుడైనాడు. నారదబోధితుడై విష్ణుకథాశిరోమణియైన భాగవతాన్ని ఎన్నుకున్నారు. ఆ రకంగా తన మదిలో కలిగిన అరకొరలను తీర్చు కొన్నారు.
బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. వీరు సంస్కృతములో ఉన్న శ్రీమద్భాగవతమును ఆంధ్రీకరించి తన జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసారు
శ్రీమదాంధ్ర భాగవతములోని పద్యాలు వినని తెలుగు వాడు లేడంటే అతిశయోక్తి కాదు. వీరు నేటి వరంగల్ జిల్లా లోని బొమ్మెర గ్రామములో జన్మించారు. శ్రీ రాముని ఆజ్ఞపై శ్రీ కృష్ణుని క థ, విష్ణు భక్తుల కథలు ఉన్న భాగవతమును తెలుగించారు. ఈ భాగవతము మొత్తము తెలుగుదనం ఉట్టిపడుతుంది.దీనిలో ఎన్నో పద్యాలు నిత్య వ్యవహారంలో ఉదహరింపబడుతున్నాయి. పోతన కవిత్వములో భక్తి, మాధుర్యము, తెలుగుతనము, పాండిత్యము, వినయము కలగలిపి ఉంటాయి. అందులో తేనొలొలుకుతున్నవనేది ఎలా చూచినా అతిశయోక్తి కానేరదు. భావి కవులకు శుభము పలికి రచన ఆరంభించిన సుగుణశీలి ఆయన.
బమ్మెర పోతనామాత్యులు తెలుగులోనికి ఆంధ్రీకరించిన మొట్టమొదటిది భాగవతం లేదా భాగవత పురాణం లేదా శ్రీమద్భాగవతం.
సర్వ వేదాంత సారం హి శ్రీ భాగవతమీస్యతే
తద్రసామృత తృప్తస్య నాన్యత్ర స్యాద్రతి క్వచిత్
శ్రీమద్భాగవతం సకల వేదాంత సారంగా చెప్పబడింది.భాగవత రసామృతాన్ని పానం చేసినవారికి మరే ఇతరములు రుచించవు . భాగవతరచనం పోతన్న దృష్టిలో భవబంధవిమోచనం.
నవవిధ భక్తుల్లో “శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, ఆత్మనివేదనం” – ఇవన్నీ ఒక పాదులో పుట్టిన మొలకలే.
విష్ణుమూర్తి కథలు శుభప్రదమైనవి, అమృతంలా ఉంటాయి; వాటిని ఎన్నిసార్లు విన్నా, ఎప్పటికప్పుడు సరి క్రొత్తగా ఉంటాయి; మన పోతన తెలుగు భాగవతం అలాంటి పవిత్రమైన కథల కాసారం; ఇది భక్తి ప్రపత్తులు, సాహిత్యమే కాకుండా అనేక శాస్త్రీయ, సాంఘిక విషయాలు అసంఖ్యాకంగా ఉన్న ఒక మహా ప్రపంచం; దీని లోని సందేశాన్ని, అనంత విజ్ఞాన విశేషాలను సంపూర్ణంగా, సమగ్రంగా పాత కొత్తల మేలు కలయిక.
పోతనామాత్యులు తన ఉపోద్ఘాతము శివప్రార్ధనతో ప్రయోభించారు. ఈ ఆలాప మహోత్కృష్టమయిన స్తోత్రము. అపారమయిన మంజులమయిన మాటలతో శోభిస్తూ ఉంటుంది.
1-1
శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోక ర
క్షైకారంభకు, భక్త పాలన కళా సంరంభకున్, దానవో
ద్రేకస్తంభకుఁ, గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాడింభకున్.
టీకా:
శ్రీ = శుభకర మైన; కైవల్య = ముక్తి; పదంబున్ = స్థితిని; చేరుట = పొందుట; కున్ = కోసము; ఐ = ఐ; చింతించెదన్ = ప్రార్థించెదన్; లోక = లోకా లన్నిటిని; రక్ష = రక్షించుటనే; ఏక = ముఖ్యమైన; ఆరంభ = సంకల్ప మున్న వాడు; కున్ = కి; భక్త = భక్తులను; పాలన = పాలించే; కళా = కళ యందు; సంరంభ = వేగిరపాటు ఉన్న వాడు; కున్ = కిన్; దానవ = రాక్షసుల; ఉద్రేక = ఉద్రేకమును; స్తంభ = మ్రాన్పడేలా చేసే వాడు; కున్ = కి; కేళి = ఆట లందు; లోల = వినోదా లందు; విలసత్ = ప్రకాశించే; దృక్ = చూపుల; జాల = వల నుండి; సంభూత = పుట్టిన; నానా = వివిధ; = బ్రహ్మాండముల {కంజాత భవాండకం (నీటిలో) జాత (పుట్టినదాని, (పద్మం) లోపుట్టిన వాని (బ్రహ్మ) అండము, బ్రహ్మాండము}; కుంభ = రాశి తనలో కలిగిన వాడు; కున్ = కి; మహా = గొప్ప; నంద = నందుని; అంగనా = భార్య యొక్క; డింభ = కొడుకు; కున్ = కున్.
భావము:
సర్వలోకాలను సంరక్షించేవాడిని, భక్తజనులను కాపాడుటలో మహానేర్పరి తనం గలవాడిని, రాక్షసుల ఉద్రేకాలను అణచేవాడిని, విలాసంగా చూసే చూపుతోటే నానా బ్రహ్మాండాలు సృజించే వాడిని, మహాత్ము డైన నందుని అంగన యొక్క కుమారుని (మహానందం దేహంగా గల ఆత్మీయుని) మోక్ష సంపదను అపేక్షించి సదా స్మరిస్తూ ఉంటాను. ఇది తెలుగు చేయబడిన భాగవత గ్రంథారంభ ప్రార్థనా పద్యం. ఈ తెలుగసేతను బమ్మెర పోతనామాత్యుల వారు తన మోక్షానికే కాదు మనందరి మోక్షాన్ని అపేక్షించి చేసారు. ఇది భాగవతానికే కాదు, తెలుగు సాహితీ విశ్వానికే మకుటాయమాన మైంది. ఇష్టదేవతా స్తుతీ, వస్తు నిర్దేశమూ కల ఈ మనోజ్ఞవృత్తం మహాభాగవతంలోని ఇతివృత్తాని కంతా అద్దం పడుతుంది. శార్దూలవిక్రీడిత వృత్తం ఎన్నుకోడంలో విషయ గాంభీర్యత సూచింపబడుతోంది. స్తుతి, నిర్దేశాలను పలికించే పద విన్యాసం బహుళార్థ సాధకత, దీర్ఘకాల రమ్యత సాధిస్తున్న సూచన కావచ్చు. (అ) శ్రీ కైవల్య పదఁబు జేరుటకునై చింతించెదన్ (ఆ) లోకరక్షైకారంభకున్ (ఇ) భక్తపాలన కళా సంరంభకున్ (ఈ) దానవోద్రేక స్తంభకున్ (ఉ) కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్ (ఊ) మహానందాంగనా డింభకున్ అనే అద్భుత ప్రయుక్తాలు ఈ పద్యంలో ఆరు (6) ఉన్నాయి. భగవంతుని ప్రధాన గుణాలైన సర్వేశ్వరత్వ, ధర్మ సంస్థాపకత్వ, శిష్టరక్షణ పరాయణత్వ, దుష్ట శిక్షన చణత్వ, విశ్వకర్తృత్వ, ఆనందమయత్వాలు అనే ఆరింటికి ప్రతీకలు యివి. (అ) శ్రీ కైవల్య పదంబు జేరుటకునై చింతించెదన్ అనటంలో మోక్షం కోసం ఉత్కంఠితుడైన పరీక్షిత్తు వృత్తాంతంతో పాటు మొత్తం భాగవతమే ధ్వనిస్తున్నది. అలాగే ప్రథమ స్కంధంలోని నారదుడు, భీష్ముడు, కుంతీదేవి మొదలైనవారి కథలూ, తృతీయ స్కంధంలోని దేవహూతి వృత్తాంతమూ, చతుర్థ స్కంధంలోని ధ్రువ చరిత్రా స్ఫురిస్తూ భగవంతుని సర్వేశ్వరత్వాన్ని నిరూపిస్తున్నాయి. ఎందుకంటే కైవల్యాన్ని అనుగ్రహించే అధికారం సర్వేశ్వరునికి మాత్రమే ఉంటుంది. (ఆ) లోకరక్షైకారంభకున్ అనటంలో హిరణ్యాక్ష హిరణ్యకశివు కంస కాలయవనాదులను (తృతీయ, సప్తమ, దశమ స్కంధాలు) సంహరించి వారి అత్యాచారాల వల్ల అస్తవ్యస్తమైన లోకాన్ని ఉద్ధరించిన భగవంతుని ధర్మ సంస్థాపకత్వం సంస్థాపించబడింది.(ఇ) భక్తపాలన కళా సంరభకున్ అనటంలో భక్తులను పాలించటం భగవంతుని కళ, ఎప్పుడెప్పుడు ఆర్తులను ఆదుకుందామా అని అనుక్షణం తహతహలాడుతుంటాడు స్వామి అనే సూచన. అలాగే గజేంద్రుణ్ణి కాపాడటానికి మహా విష్ణువు వైకుంఠం నుంచి పరుగెత్తుకు వచ్చిన వృత్తాంతం (అష్టమ స్కంధం) స్పురిస్తూ భగవంతుని శిష్ట రక్షణ పరాయణత్వాన్ని చాటుతున్నది. (ఈ) దానవోద్రేకస్తంభకున్ అనటంతో అష్టమ స్కంధంలోని వామనావతారం వ్యంజకమైంది. తరువాతి మన్వంతరంలో ఇంద్రుడు కావలసిన బలి, వరబలంతో ముందుగానే స్వర్గాన్ని ఆక్రమించి ఇంద్రపదం కాంక్షించాడు. దుష్టశిక్షణచణు డైన స్వామి వామనుడై, ఆ దానవేంద్రుని ఉద్రేకానికి పగ్గాలు పట్టి స్తంభింపజేయటం ధ్వనించింది. (ఉ) కేళిలోల… కుంభకున్ అనటం వల్ల భగవంతుని విశ్వకర్తృకత్వాన్ని వెల్లడించే సూర్యవంశ చంద్రవంశాల చరిత్ర (నవమస్కంధం) స్ఫురిస్తోంది. స్వామి విలాసంగా త్రిప్పే కళ్లలో నుంచే కదా బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి. సృష్టి జరుగుతుంది. నిజానికి స్వామికళ్లు సూర్యచంద్రులేగా. ఇంకా శ్రీహరే ప్రధానకర్తని ద్వితీయ స్కంధం నిరూపిస్తోంది. (ఊ) మహానందాంగనా డింభకున్ అనటం కృష్ణలీలా సర్వస్వమైన దశమ స్కంధానికి, ఆ నందాంగనకు ఆనందానికి, మహా ఆనందమే దేహంగా కల స్వరూపికి ప్రతీక.
1-2
వాలిన భక్తి మ్రొక్కెద నవారిత తాండవ కేళికిన్, దయా
శాలికి, శూలికిన్, శిఖరిజా ముఖ పద్మ మయూఖ మాలికిన్,
బాల శశాంక మౌళికిఁ, గపాలికి, మన్మథ గర్వ పర్వతో
న్మూలికి, నారదాది మునిముఖ్య మనస్సరసీరుహాలికిన్.
వాలిన = అతిశయించిన; భక్తి = భక్తితో; మ్రొక్కెదన్ = మ్రొక్కెదను; అవారిత = వారింపలేని; తాండవ = తాండవమనే; కేళి = ఆట ఆడే వాని; కిన్ = కి; దయాశాలి = దయకలవాడి; కిన్ = కి; శూలి = శూల ధారి; కిన్ = కి; శిఖరి = పర్వతుని; జా = పుత్రికయొక్క; ముఖ = ముఖము అనే; పద్మ = పద్మానికి; మయూఖమాలి = సూర్యుడు {మయూఖమాలికిరణములు కలవాడు, సూర్యుడు}; కిన్ = కి; బాల = లేత; శశాంక = చంద్రుని {శశాంకశశ (కుందేలు) గుర్తు కలవాడు, చంద్రుడు}; మౌళి = శిరస్సున ధరించిన వాడు; కిన్ = కి; కపాలి = పుర్రె ధరించే వాడు; కిన్ = కి; మన్మథ = మన్మథుని; గర్వ = గర్వమనే; పర్వత = పర్వతాన్ని; ఉన్మూలి = నిర్మూలించిన వాడు; కిన్ = కి; నారద = నారదుడు; ఆది = మొదలైన; ముని = ముని; ముఖ్య = ముఖ్యుల; మనస్ = మనసులనే; సరసీరుహ = పద్మాలలోని {సరసీరుహ – సరస్సులో పుట్టినది, పద్మం}; అలి = తుమ్మెద లాంటి వాడు; కిన్ = కి.
భావము:
“అనంత లీలాతాండవలోలు డైన పరమ శివునికి, మిక్కలి దయ గలవానికి, త్రిశూల ధారికి, పర్వతరాజ పుత్రి పార్వతీదేవి యొక్క ముఖ పద్మం పాలిటి సూర్యునికి, తలపై నెలవంక ధరించిన వానికి, మెడలో పుర్రెల పేరు ధరించిన వానికి, మన్మథుడి గర్వం సర్వం అణిచేసిన వానికి, నారదాది మునుల మానస సరోవరాలలో విహరించే వానికి శిరస్సు వంచి భక్తి పురస్సరంగా ప్రణామం చేస్తున్నాను.”
1-3
ఆతత సేవఁ జేసెద సమస్త చరాచర భూత సృష్టి వి
జ్ఞాతకు, భారతీ హృదయ సౌఖ్య విధాతకు, వేదరాశి ని
ర్ణేతకు, దేవతా నికర నేతకుఁ, గల్మష ఛేత్తకున్, నత
త్రాతకు, ధాతకున్, నిఖిల తాపస లోక శుభప్రదాతకున్.
టీకా:
ఆతత = అతిశయమైన; సేవన్ = భక్తిని; చేసెదన్ = చేసెదను; సమస్త = సమస్తమైన; చర = చరములు; అచర = అచరములుయైన; భూత = ప్రాణులను; సృష్టి = సృష్టించే; విజ్ఞాత = నేర్పరి; కున్ = కి; భారతీ = భారతీ దేవి; హృదయ = హృదయానికి; సౌఖ్య = సంతోషాన్ని; విధాత = కలిగించేవాడు; కున్ = కి; వేద = వేదాల; రాశి = సమూహాలను; నిర్ణేత = ఏర్పరిచిన వాడు; కున్ = కి; దేవతా = దేవతల; నికర = సమూహము యొక్క; నేత = నాయకుడు; కున్ = కి; కల్మష = పాపములను; ఛేత్త = ఛేధించే వాడు; కున్ = కి; నత = నమస్కరించే వారిని; త్రాత = రక్షించే వాడు; కున్ = కి; ధాత = బ్రహ్మ; కున్ = కి;నిఖిల = మొత్తం; తాపస = తాపసులు; లోక = అందరికి; శుభ = శుభాలను; ప్రదాత = ఇచ్చేవాడు; కున్ = కి.
భావము:
చరాచర ప్రపంచాన్నంతా చక్కగా సృష్టించడం నేర్చినవాడు, సరస్వతీదేవికి మనోరంజకం చేకూర్చువాడు, వేదాల నన్నింటినీ సమర్థంగా సమకూర్చినవాడు, సమస్త బృందారక బృందాన్ని నాయకుడై తీర్చిదిద్దువాడు, భక్తుల పాపాలను పోకార్చు వాడు, దీనజనులను ఓదార్చువాడు, తపోధను లందరికీ శుభాలు ఒనగూర్చువాడూ ఐనట్టి బ్రహ్మదేవుణ్ణి నేను శ్రద్ధాభక్తులతో సంసేవిస్తున్నాను.
1-4
అని, నిఖిల భువన ప్రధాన దేవతా వందనంబు సేసి.
టీకా:
అని = ఈ విధంగా; నిఖిల = సమస్త; భువన = లోకలకు; ప్రధాన = ముఖ్యమైన; దేవతా = దేవతలకు; వందనంబు = నమస్కారము; సేసి = చేసి
భావము:
ఇలా సకలలోక పాలకు లైన ముగ్గురు మూర్తులకు చేతులెత్తి నమస్కారం చేసిన అనంతరం.
1-5
ఆదర మొప్ప మ్రొక్కిడుదు నద్రి సుతా హృదయానురాగ సం
పాదికి, దోషభేదికిఁ, బ్రపన్నవినోదికి, విఘ్నవల్లికా
చ్ఛేదికి, మంజువాదికి, నశేష జగజ్జన నంద వేదికిన్,
మోదకఖాదికిన్, సమద మూషక సాదికి, సుప్రసాదికిన్.
టీకా:
ఆదరము = మన్నన; ఒప్పన్ = ఉట్టిపడేలా; మ్రొక్కున్ = నమస్కారమును; ఇడుదున్ = పెట్టెదను; అద్రి = పర్వత; సుతా = పుత్రి; హృదయ = హృదయ; అనురాగ = అనురాగాన్ని; సంపాది = సంపాదించినవాడు; కిన్ = కి; దోష = పాపాలని; భేది = పోగొట్టేవాడు; కిన్ = కి; ప్రపన్న = శరణాగతులైన భక్తులకు; వినోది = సంతోషము కలిగించు వాడు; కిన్ = కి; విఘ్న = విఘ్నాల; వల్లికా = సమూహమును; చ్ఛేది = నాశనముచేసే వాడు; కిన్ = కి; మంజు = మనోజ్ఞముగ; వాది = మాట్లాడే వాడు; కిన్ = కి; అశేష = అనేక; జగత్ = లోకములందలి; జన = జనులకు; నంద = ఆనందము; వేది = కలిగించే వాడు; కిన్ = కి; మోదక = ఉండ్రాళ్ళు; ఖాది = తిను వాడు; కిన్ = కి; సమద = చక్కగ; మూషక = ఎలుక; సాది = నడిపే వాడు; కిన్ = కి; సుప్రసాది = మంచి నిచ్చే వాడు; కిన్ = కి.
భావము:
పర్వతరాజు హిమవంతుని కుమార్తె ఉమాదేవి మాతృప్రేమ అనే సంపదను సంపాదించిన వాడు, సకల పాపాలను విరిసిపోయేలా చేసేవాడు, ఆపన్నుల విన్నపాలను ఆమోదించువాడు, సమస్త విఘ్నాలనే బంధనాలు ఛేదించు వాడు, మంజుల మధుర భాషణాలతో అశేష భక్తులకు విశేష సంతోషాన్ని ప్రసాదించువాడు, నివేదించిన కుడుములూ ఉండ్రాళ్లూ కడపునిండా ఆరగించి మూషకరాజును అధిరోహించి విహరించువాడు, ముల్లోకాలకూ శుభాలు ప్రసాదించి విరాజిల్లువాడు ఐన వినాయకునకు వంగి వంగి నమస్కరిస్తున్నాను.
1-6
క్షోణితలంబునన్ నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికిఁ, జంచరీక చయ సుందరవేణికి, రక్షితామర
శ్రేణికిఁ, దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్,
వాణికి. నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్.
టీకా:
క్షోణితలంబునన్ = నేలకు; నుదురు = లలాటము; సోఁకఁగన్ = ఆనేలా; మ్రొక్కి = నమస్కరించి; నుతింతున్ = స్తుతిస్తాను; సైకత = ఇసక తిన్నెల లాంటి; శ్రోణి = పిరుదులు గలామె; కిన్ = కు; చంచరీక = తుమ్మెదల; చయ = గుంపు లాంటి; సుందర = అందమైన; వేణి = జుట్టు గలామె; కిన్ = కు; రక్షిత = రక్షింప బడే; అమర = దేవతల; శ్రేణి = సమూహము గలామె; కిన్ = కి; తోయజాతభవ = నీటిలో పుట్టిన (పద్మం) దానిలో పుట్టిన వాని (బ్రహ్మ) యొక్క; చిత్త = మనసును; వశీకరణ = వశీకరించు కోగల; ఏక = అసహాయ శూర; వాణి = వాక్కు గలామె; కిన్ = కి; వాణి = సరస్వతీదేవి; కిన్ = కి; అక్ష = స్పటికముల; దామ = మాల; శుక = రామ చిలుక; వారిజ = తామర పువ్వు; పుస్తక = పుస్తకము; రమ్య = అందంగా; పాణి = చేత ధరించి నామె; కిన్ = కి.
భావము:
నేలకు నెన్నుదురు తాకేలా సాగిలపడి మ్రొక్కి, సైకత శ్రోణీ, చదువులవాణీ, అలినీలవేణీ అయిన వాణిని సన్నుతిస్తాను. సుధలు వర్షించే తన సుందర సుకుమార సూక్తులతో అరవిందభవుని అంతరంగాన్ని ఆకర్షించే సౌందర్యరాశిని; తన కటాక్ష వీక్షణాలతో సుర నికరాన్ని కనికరించే కరుణామయిని; ఒక చేతిలో అక్షమాల, ఇంకో చేతిలో రాచిలుక, వేరొక చేతిలో తామర పువ్వు, మరో చేతిలో పుస్తకం ముచ్చటగా ధరించే ఆ నాలుగు చేతుల చల్లని తల్లిని సదా సంస్తుతిస్తాను.
1-7
పుట్టం బుట్ట, శరంబునన్ మొలవ నంభోయానపాత్రంబునన్
నెట్టం గల్గను గాళిఁ గొల్వను బురాణింపన్ దొరంకొంటి మీఁ
దెట్టే వెంటఁ జరింతుఁ దత్సరణి నా కీవమ్మ యో! యమ్మ మేల్
పట్టున్ నా కగుమమ్మ నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ! దయాంభోనిధీ!
టీకా:
పుట్టన్ = పుట్టలో; పుట్ట = పుట్ట లేదు (వాల్మీకిని కాదు); శరంబునన్ = రెల్లుపొదలో; మొలవ = పుట్ట లేదు (సుబ్రహ్మణ్యుడను కాదు) {పాఠాంతరం – పుట్టంబుట్టశిరంబున్ మొలువ = శిరస్సు మీద పుట్టపుట్టి ఉన్నవాడను కాదు (వాల్మీకిని కాదు)}; అంభస్ = జల; యాన = ప్రయాణ; పాత్రంబునన్ = సాధనములో – పడవలో; నెట్టన్ = యదార్థానికి; కల్గను = పుట్ట లేదు (వ్యాసుని కాదు); కాళిన్ = కాళి; కొల్వను = ఆరాధించను (కాళిదాసును కాదు); పురాణింపన్ = పురాణ (భాగవత) రచనకి; దొరంకొని = పూనుకొని; ఉంటిని = ఉన్నాను; మీఁదు = ముందు చెప్పిన; ఎట్టే = అటువంటి వారి; వెంటన్ = పద్ధతినే; చరింతున్ = నడుస్తాను; తత్ = ఆ; సరణి = విధమును; నాకు = నాకు; ఈవు = ఇవ్వుము; అమ్మ = తల్లీ; ఓ = ఓ; అమ్మ = అమ్మ; మేల్ = మంచి; పట్టున్ = దన్నుగా; నాకు = నాకు; అగుము = ఉండుము; అమ్మ = తల్లీ; నమ్మితిన్ = (నిన్నే) నమ్మొకొంటిని; చుమీ = సుమా; బ్రాహ్మీ = సరస్వతీదేవీ {బ్రహ్మి – బ్రహ్మ దేవుని భార్య, సరస్వతి}; దయ = దయకు; అంభోనిధీ = సముద్రమా.
భావము:
అందరిని పుట్టించే బ్రహ్మదేవుని అర్థాంగీ! సరస్వతీదేవి! *నేను పుట్టలో పుట్టిన వాల్మీకిని కాను; బాణం నుంచి వచ్చిన పేరు కలిగిన బాణుడను కాను (రెల్లుపొదలో పుట్టిన సుబ్రహ్మణ్యుడను కాను); పడవలో పుట్టిన వ్యాసుడను కాను; కాళీమాతను కొలిచిన కాళిదాసుని కాను; కాని మాతా! ఈ భాగవత పురాణ రచన కూడ వారి లాగే గంభీరంగా చేయాలని పూనుకున్నాను. దీనిని కూడ వారి రచనల వలెనె శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించు తల్లీ! నిన్నే నమ్ముకున్నానమ్మా. నన్ను అత్యుత్తమ మార్గంలో నడిపించు. దయామయీ! {*‘పుట్టంబుట్టశిరంబునన్ మొలవ’ అనే పాఠ్యాంతరం ప్రకారం పుట్టలో పుట్టి శిరస్సున పుట్ట పుట్టిన వాల్మీకిని కాదు}
1-8
శారదనీరదేందు, ఘనసార, పటీర, మరాళ, మల్లికా
హార, తుషార, ఫేన, రజతాచల, కాశ, ఫణీశ, కుంద, మం
దార, సుధాపయోధి, సితతామర, సామరవాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిఁ గానఁగ నెన్నఁడు గల్గు, భారతీ!
టీకా:
శారద = శరదృతు; నీరద = మేఘము; ఇందు = చంద్రుడు; ఘనసార = కర్పూరం; పటీర = మంచిగంధం; మరాళ = హంస; మల్లికా = మల్లిపువ్వుల; హార = దండ; తుషార = మంచు; ఫేన = నురుగు; రజత = వెండి; అచల = కొండ; కాశ = రెల్లుపువ్వులు; ఫణీశ = ఆదిశేషుడు; కుంద = అడవిమల్లె; మందార = కల్పవృక్షము; సుధా = పాల; పయోనిధి = సముద్రము; సిత = తెల్లని; తామరస = తామరపువ్వు; అమర వాహినీ = ఆకాశ గంగ {అమర వాహిని – అమర (దేవతల) వాహినీ (నది) – ఆకాశగంగ}; శుభ = శుభకర మైన; ఆకారతన్ = ఆకారముతో; ఒప్పు = అమరు; నిన్ను = నిన్ను; మదిన్ = మదిలో; కానగ = చూచుట; ఎన్నడు = ఎప్పుడు; కల్గు = కలుగుతుంది; భారతీ = సరస్వతీదేవీ.
భావము:
భారతీదేవి! తెల్లని కాంతులు వెల్లివిరసే శరత్కాల మేఘాలు, శరదృతు చంద్రబింబం, పచ్చకర్పూరం, మంచిగంధం, రాజహంసలు, జాజిపూల దండలు, కురిసే మంచు, తెల్లని నురుగు, వెండికొండ, రెల్లుపూలు, ఆదిశేషుడు, మల్లెపూలు, కల్పవృక్షం, పాలసముద్రం, తెల్లతామరలు, ఆకాశగంగా నీ ఉజ్జ్వల శుభంకర ఆకారానికి ఉపమానాలు మాత్రమే కదమ్మా. అంతటి స్వచ్ఛ ధవళ సుందరమూర్తి వైన నీ దర్శనం కన్నులార మనసుదీర ఎన్నడు అనుగ్రహిస్తావు తల్లీ!
1-9
అంబ, నవాంబుజోజ్జ్వలకరాంబుజ, శారదచంద్రచంద్రికా
డంబర చారుమూర్తి, ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా
చుంబిత దిగ్విభాగ, శ్రుతిసూక్తి వివిక్త నిజప్రభావ, భా
వాంబరవీధి విశ్రుతవిహారిణి, నన్ గృపఁ జూడు భారతీ!
టీకా:
అంబ = తల్లీ; నవ = అప్పుడే పుట్టిన; అంబుజ = పద్మములతో; ఉజ్వల = ప్రకాశిస్తున్న; కర = చేతులనే; అంబుజ = పద్మములు కలదాన; శారద = శరదృతువు లోని; చంద్ర = చంద్రుని; చంద్రిక = వెన్నెల; ఆడంబర = డాబు గల; చారు = అందమైన; మూర్తి = స్వరూపము కలదానా; ప్రకట = ప్రకాశించే; స్ఫుట = కొట్టొచ్చినట్లు కనబడెడి; భూషణ = ఆభరణాల లోని; రత్న = రత్నాల; దీపికా = కాంతి; చుంబిత = స్పృశించు; దిక్ = దిక్కుల; విభాగ = విభాగాలు యున్నదానా; శ్రుతి = వేద; సూక్తి = సూక్తులచే; వివిక్త = వెల్లడింపబడిన; నిజ = స్వంత; ప్రభావ = ప్రభావము కలదానా; భావ = భావాలనే; అంబర = ఆకాశ; వీధి = వీధిలో; విశ్రుత = విస్త్రుతముగా; విహారిణి = విహరించేదానా; నన్ = నన్ను; కృప = దయ; అన్ = తో; చూడు = అనుగ్రహించుము; భారతీ = సరస్వతీదేవీ.
భావము:
తల్లీ! వికాస ప్రకాశాలకి ప్రతీకగా అప్పుడే వెల్లి విరుస్తున్న పద్మం అలంకరించిన హస్తంతో, శరచ్చంద్రుని వెన్నెల వికాసానికి చల్లదనానికి అనురూప మైన శ్వేత స్వరూపంతో, విజ్ఞాన స్వరూపాలై దిగ్దిగంతాలు సర్వం వెలిగిస్తున్న ఆభరణాల లోని మణి మాణిక్యాల కాంతులతో, వేదసూక్తులు వెల్లడిచేసే స్వీయ ప్రభావంతో, ఉత్తమతమ భావాల పరంపరలలో విస్తృతంగా విహారిస్తుండే భారతీదేవి! నీ దయాపూరిత దృక్కులతో అనుగ్రహించమ్మా!
1-10
అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.
టీకా:
అమ్మలన్ = అమ్మలను(సప్త మాతృకలు); కన్న = కన్నటువంటి (కంటె గొప్ప దైన); అమ్మ = తల్లి; ముగురు = ముగ్గురు {ముగురు అమ్మలు – లక్ష్మి సరస్వతి పార్వతి}; అమ్మల = అమ్మలకి; మూలపు = మూల మైన; అమ్మ = అమ్మ; చాలన్ = చాలా; పెద్ద = పెద్ద; అమ్మ = అమ్మ; సురారుల = రాక్షసుల యొక్క {సురారులు – సుర (దేవతల) అరులు (శత్రువులు), రాక్షసులు}; అమ్మ = తల్లి; కడుపు = కడుపు; ఆఱడి = మంట; పుచ్చిన = కలిగించిన; అమ్మ = అమ్మ; తన్ను = తనను; లోన్ = మనసు లోపల; నమ్మిన = నమ్మిన; వేల్పు = దేవతల; అమ్మల = తల్లుల; మనమ్ముల = మనసులలో; ఉండెడి = ఉండే; అమ్మ = అమ్మ; దుర్గ = దుర్గాదేవి; మా = మా; అమ్మ = అమ్మ; కృప = దయా; అబ్ధి = సముద్రముతో; ఇచ్చుత = ఇచ్చుగాక; మహత్త్వ = గొప్పదైన; కవిత్వ = కవిత్వంలో; పటుత్వ = పటుత్వమనే; సంపదల్ = సంపదలు.
భావము:
దుర్గాదేవి తల్లు లందరికి తల్లి; సప్తమాతృకలను కన్నతల్లి; ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి; అందరు అమ్మల కన్నా అధికురాలైన గొప్పతల్లి; రక్కసి మూకలను అణచిన యమ్మ; నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి; అయిన మా అమ్మ దయాసముద్రి అయి ఈ మహాభాగవత తెలుగు ప్రణీత మందు కవిత్వంలో గొప్పదనము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక.
1-11
హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రో వర్థంపుఁ బెన్నిక్క, చం
దురు తోఁబుట్టువు, భారతీ గిరిసుతల్ తో నాడు పూఁబోఁడి, తా
మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా
సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్యకల్యాణముల్.
టీకా:
హరి = విష్ణుమూర్తి; కిన్ = కి; పట్టపు = పట్టపు; దేవి = రాణి; పున్నెముల = పుణ్యముల; ప్రోవు = పోగు; అర్థంపు = సంపదలకు; పెన్ = పెద్ద; ఇక్క = నిలయము; చందురు = చంద్రుడికి; తోన్ = తో కలిసి – తోడ; పుట్టువు = పుట్టినది; భారతీ = సరస్వతి; గిరిసుతల్ = పర్వత పుత్రిల (పార్వతి); తోన్ = తో కలిసి; ఆడు = ఆడే; పూఁన్ = పూవును; పోడి = పోలినది – స్త్రీ; తామరలు = పద్మముల; అందున్ = లో; ఉండెడి = ఉండే; ముద్దు = మనోజ్ఞముగ ఉన్న; ఆలు = స్త్రీ; జగముల్ = లోకాలు; మన్నించు = గౌరవించే; ఇల్లు = గృహమునకు; ఆలు = స్త్రీ; భాసురతన్ = (తన) ప్రకాశము వలన; లేములు = దరిద్రాలను; వాపు = పోగొట్టే; తల్లి = అమ్మ; సిరి = లక్ష్మి; ఇచ్చున్ = ఇచ్చుగాక; నిత్య = నిత్యమైన; కల్యాణముల్ = శుభములు.
భావము:
దేవాదిదేవు డైన శ్రీహరి పట్టపుదేవి శ్రీదేవి; రాశి పోసిన పుణ్యాలు రూపుగట్టిన పుణ్యవతి; సిరిసంపదలకు పెన్నిధి; చందమామకు గారాల చెల్లెలు; వాణితోను పార్వతీదేవితోను క్రీడించే పూబోణి; అరవిందాలు మందిరంగా గల జవరాలు; అఖిలలోకాలకు ఆరాధ్యురాలైన అన్నులమిన్న; చల్లని చూపులతో భక్తుల దారిద్ర్యాన్ని పటాపంచలు చేసే బంగారు తల్లి; ఆ శ్రీమహాలక్ష్మి నిత్యకల్యాణాలు అనుగ్రహించు గాక.
అని యిష్టదేవతలం జింతించి దినకర కుమార ప్రముఖులం దలంచి, ప్రథమ కవితా విరచన విద్యావిలాసాతిరేకి వాల్మీకి నుతియించి, హయగ్రీవదనుజకర పరిమిళిత నిగమ నివహ విభాగ నిర్ణయ నిపుణతా సముల్లాసునకు వ్యాసునకు మ్రొక్కి, శ్రీమహాభాగవత కథాసుధారసప్రయోగికి శుకయోగికి నమస్కరించి, మృధు మధురవచన వర్గ పల్లవిత స్థాణునకున్ బాణునకుం బ్రణమిల్లి, కతిపయ శ్లోక సమ్మోదితసూరు మయూరు నభినందించి, మహాకావ్యకరణ కళావిలాసుం గాళిదాసుం గొనియాడి కవి కమల రవిన్ భారవిన్ బొగడి విదళితాఘు మాఘు వినుతించి, యాంధ్రకవితాగౌరవజనమనోహరి నన్నయ సూరిం గైవారంబు సేసి, హరిహర చరణారవిందవందనాభిలాషిం దిక్కమనీషిన్ భూషించి, మఱియు నితర పూర్వ కవిజన సంభావనంబు గావించి, వర్తమాన కవులకుం బ్రియంబు వలికి, భావి కవుల బహూకరించి, యుభయకావ్యకరణ దక్షుండనై.
ఈ భాగవతము ఎవరు చదువుచున్నారో వారికందరికి, మంచిమనస్సుతో ఉన్న వారికి అర్థమయ్యే స్వరూపము కలిగినది. ఇది ఈ పుడమి మీదకి వచ్చి నిలబడిన కల్పతరువు. భాగవతమనేది వేరొకటి కాదు. సాక్షాత్తుగా కల్పవృక్షం ఉన్నట్లే, భాగవతంలో ఒక పది పద్యములు వచ్చినట్లయితే అటువంటి వ్యక్తి కల్పవృక్షమును జేబులో పెట్టుకొని తిరుగుతున్నట్లు లెక్క. వాని కోరిక తీరుతుంది. భాగవతంలో పోతనగారు గొప్పగొప్ప ప్రయోగము లన్నిటిని, పద్యములుగా తీసుకువచ్చి పెట్టేశారు. వాని కోరిక ఎందుకు తీరదు? అందుకని భాగవతము అంత గొప్పది! అటువంటి భాగవతమును శుకబ్రహ్మ వివరణ చేశారు….శివకిషెన్ జీ
